Oats Peanuts Laddu : రోజుకు ఒక లడ్డూను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా.. అవును ఈ లడ్డూను రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఓట్స్, నువ్వులు, పల్లీలు కలిపి చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లడ్డూలను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ నువ్వుల లడ్డు తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – అర కప్పు, నువ్వులు – అర కప్పు, ఓట్స్ – ఒక కప్పు, బెల్లం తురుము – ఒకటింపావు కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, తరిగిన బాదం – కొద్దిగా, తరిగిన జీడిపప్పు – కొద్దిగా.
ఓట్స్ నువ్వుల లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి దోరగా వేయించాలి. పల్లీలు వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నువ్వులు కూడా వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఓట్స్ ను వేసి చిన్న మంటపై కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత వీటిని జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో బెల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ముందుగా సిద్దం చేసుకున్న ఓట్స్ మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి.
తరువాత వీటిని ఓట్స్ మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత వీటన్నింటిని చక్కగా కలుపుకుని తగిన పరిమాణంలో తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ నువ్వుల లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూలు వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. రోజుకు ఒకటి చొప్పున వీటిని తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.