Betel Leaves Rice : తమలపాకు.. ఇది మనందరికి తెలిసిందే. తలమపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. డయాబెటిస్ ను నియంత్రించడంలో, గాయాలు త్వరగా మానేలా చేయడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఇన్ఫెక్షన్ లను మన దరి చేరుకుండా చేయడంలో ఇలా అనేక రకాలుగా తమలపాకు మనకు సహాయపడుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తమలపాకుతో మనం ఎంతో రుచిగా ఉండే అన్నాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. తమలపాకు అన్నం చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన అన్నంతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ అన్నం చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తమలపాకులతో రుచిగా అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకు అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – రెండు టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి – 12, ఎండుమిర్చి – 5, నువ్వులు – రెండున్నర టేబుల్ స్పూన్స్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పల్లీలు – పావు కప్పు, ఆవాలు – ముప్పావు టీ స్పూన్, జీలకర్ర – ముప్పావు టీ స్పూన్, ఉల్లిపాయ చీలికలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, తమలపాకులు – 5, అన్నం- ఒకటిన్నర కప్పు.
తమలపాకు అన్నం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత తమలపాకును సన్నగా తరిగి వేసుకోవాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత అన్నం, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు కలుపుతూ వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తమలపాకు అన్నం తయారవుతుంది. అన్నానికి తగినట్టు తలమపాకును వేసుకోవాలి. అన్నాని కంటే తమలపాకును ఎక్కువగా వేసుకుంటే అన్నం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ విధంగా తమలపాకుతో చేసిన అన్నాన్ని అందరూ ఇష్టంగా తింటారు. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడూ ఈ విధంగా తమలపాకు అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుంది.