Soya Chunks 65 : మీల్ మేకర్స్.. ఇవి మనందరికి తెలిసినవే. సోయా గింజలను వీటిని తయారు చేస్తారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మీల్ మేకర్ లను తినడం వల్ల శరీరానికి కావల్సినంత ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. మీల్ మేకర్ లతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మీల్ మేకర్ లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మీల్ మేకర్ 65 కూడా ఒకటి. మీల్ మేకర్ లతో చేసే ఈ వంటకం రుచిగా, కరకరలాడుతూ ఉంటుంది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మీల్ మేకర్ 65 ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా చంక్స్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి- 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్, మైదాపిండి – ఒక టీ స్పూన్, బియ్యం పిండి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత. నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కరివేపాకు – ఒక రెమ్మ.
సోయా చంక్స్ 65 తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లలో వేడి నీటిని పోసి కలపాలి. వీటిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత చేత్తో నీటిని పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె, కరివేపాకు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. మసాలాలన్నీ మీల్ మేకర్ లకు పట్టేలా కలుపుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక సిద్దం చేసుకున్న మీల్ మేకర్ లను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అదే ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా చంక్స్ 65 తయారవుతుంది. దీనిని నేరుగా లేదా ఇతర వంటల్లో సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మీల్ మేకర్ లతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఒక్క మీల్ మేకర్ ను కూడా విడిచి పెట్టకుండా దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.