Paneer Bhurji : మనం పనీర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పనీర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. దీనిని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పనీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. పనీర్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పనీర్ బుర్జీ కూడా ఒకటి. మనకు ఎక్కువగా ధాబాలలో ఇది లభిస్తూ ఉంటుంది. పనీర్ బుర్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. కేవలం 10 నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పనీర్ బుర్జీని ధాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ బుర్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన చిన్న క్యాప్సికం – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద టమాట – 1, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, పనీర్ – 200 గ్రా., తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
పనీర్ బుర్జీ తయారీ విధానం..
ముందుగా పనీర్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి పింక్ కలర్ లోకి మారే వరకు వేయించాలి. తరువాత క్యాప్సికం ముక్కలు వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత గరం మసాలా, ఉప్పు, జీలరకర్ర పొడి, కారం, ధనియాల పొడి, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
మసాలాలన్నీ చక్కగా వేగిన తరువాత ముక్కలుగా చేసుకున్న పనీర్ ను వేసి కలపాలి. వీటిని 3 నుండి 4 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ బుర్జీ తయారవుతుంది. దీనిని రోటీ, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా పనీర్ బుర్జీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.