Mamidikaya Pachadi : వేసవికాలం వచ్చిందంటే చాలు మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పచ్చి మామిడికాయలు. మామిడికాయలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మామిడికాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి మామిడికాయలను నేరుగా తినడంతో పాటు వీటితో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. మామిడికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది ఈ పచ్చడిని తయారు చేయడం చాలా కష్టమని భావిస్తూ ఉంటారు. కానీ కేవలం 10 నిమిషాల్లో వంటరాని కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. సులభంగా, రుచిగా నిల్వ ఉండేలా మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుల్లటి మామిడికాయలు – 2, వెల్లుల్లిపాయ – 1, ఆవ పిండి – రెండున్నర టేబుల్ స్పూన్స్, మెంతి పొడి – అర టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ, పసుపు – అర టీ స్పూన్, కారం – రెండున్నర టేబుల్ స్పూన్స్, ఉప్పు – రెండు టేబుల్ స్పూన్స్, పల్లీ నూనె – 100 గ్రా..
మామిడికాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ మామిడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వెల్లుల్లి పాయలను జార్ లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చివరగా నూనె వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి తయారవుతుంది. దీనిని 3 గంటల పాటు ఊరబెట్టిన తరువాత వేడి వేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మామిడికాయ పచ్చడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నుండి మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా సులభంగా మామిడికాయలతో పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు.