ఏ సినిమా చూసినా ఏముంది గర్వకారణం అన్నీ ఒక తాను ముక్కలే. సిగ్గు, నిజాయతీ, మానం లేనిదే సినిమా అని మళ్ళీ నిరూపితం ఇప్పటి సినిమాలు. అర్జున్ రెడ్డి సినిమా ఒక కళాఖండం, నా మనస్తత్వం మీద ఒక సర్జికల్ స్ట్రైక్. అందులో నాకు నచ్చనివి కొన్ని.. అమ్మాయిని కొట్టడం. ఎదో వాడొక్కడికే ఉన్నటు చూపించడం. రూమ్ లో మాదక ద్రవ్యాలు తయారు చెయ్యడం. రోడ్డు మీద ఐస్ గడ్డలు పెట్టుకోవడం. ఎంగేజ్మెంట్ అయిన పిల్లతో సంబంధం. లేకి వెధవ లాగా పబ్లిక్ లో బాటిల్ ఊపడం.
ప్యాంటు లోనే ఉచ్చ పోసుకునేంత ఒళ్ళు బలిసిన తనం.. అదేదో హీరోయిజం అన్నట్టు ఇంటర్వెల్ బాంగ్ ఇక్కడ. లావుగా ఉన్న అమ్మాయిలతోనే అందమైన అమ్మాయిలు ఉండాలట. వీడి వెర్రితనాన్ని ఎంకరేజ్ చేసే ఇంగ్లీషు మాట్లాడే 70 ఏళ్ల బామ్మ. హాస్పిటల్ నర్స్ లతో అసభ్యకరంగా ఉండడం. చెప్పుకుంటూ పోతే ప్రతి 5 నిముషాలకి ఒక దరిద్రం ఉంది ఈ సినిమాలో. వీటిలో అనైతికమైనవి, అసాంఘికమైనవే కాదు, చట్ట వ్యతిరేకమైనవి కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్న ఈ సినిమాని జనాలు ఎగబడి ఎలా చూసారో అర్ధం కాలేదు. వేరే భాషల్లో రీమేక్ లు, అన్నింట్లో సూపర్ హిట్. విజయ్ దేవరకొండని రాత్రికి రాత్రే పవన్ కళ్యాణ్ స్థాయి స్టార్ ని చేసేసింది. బాలీవుడ్ లో అందగత్తెలందరూ దేవరకొండతో పనిచేయాలని ఉవ్విళ్ళూరారు.
నాకు మైండ్ పనిచెయ్యలా చాలా రోజులు. బాగా డబ్బులుండి, విపరీతమైన స్వార్ధం, పక్క వాడు ఏమనుకుంటే నాకేంటి అనే తత్వం, తన శారీరక కోరికలు తీర్చుకోడం కన్నా ప్రపంచంలో మించినది ఇంకేం లేదనే నైజం – ఇది నాకు అర్ధమైన హీరో క్యారెక్టర్. సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వీడు చేసిన వాటిలో ఒక పది శాతం చేసినా, వాడి జీవితం సర్వనాశనం. బాగా డబ్బున్న వాడు, కుల బలం, పలుకుబడి ఉన్నాయి కాబట్టి అన్ని చేసినా, నిలదొక్కుకోగలిగాడు. ఇవి సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నాయో లేదో తెలీదు గాని, ఇలాంటి సినిమా ని నెత్తికెక్కించుకుని నాలాంటివాళ్ళకి సమాజమే ఒక తప్పు సందేశం ఇచ్చింది.