Mango Ice Cream : పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే చిరుతిళ్లల్లో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఐస్ క్రీమ్ మనకు బయట విరివిరిగా లభిస్తుంది. అలాగే వివిధ రుచుల్లో ఇది లభిస్తూ ఉంటుంది. వివిధ రకాల ఐస్ క్రీమ్ వెరైటీలలో మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. మామిడికాయ రుచితో ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ను మనం చాలా సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మామిడి పండు, ఫ్రెష్ క్రీమ్ ఉంటే చాలు దీనిని సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చల్ల చల్లగా, ఎంతో రుచిగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్రీమ్ – రెండు కప్పులు, చక్కెర పొడి – అర కప్పు, మామిడి పండు గుజ్జు – ముప్పావు కప్పు, ఎల్లో ఫుడ్ కలర్ – చిటికెడు, టూటీ ఫ్రూటీ పలుకులు – కొద్దిగా.
మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో క్రీమ్, చక్కెర పొడి వేసి 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. తరువాత మామిడి పండు గుజ్జును వేసి మరలా బీట్ చేసుకోవాలి. తరువాత ఫుడ్ కలర్, టూటీ ఫ్రూటీ వేసి మరో 5 నిమిషాల పాటు బీట్ చేసుకుని గాజు గిన్నెలోకి లేదా స్టీల్ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై సిల్వర్ పాయిల్ వేసి మూత పెట్టాలి. ఇలా తయారు చేసుకున్న గిన్నెను డీప్ ఫ్రిజ్ లో 10 నుండి 12 గంటల పాటు ఉంచాలి. తరువాత దీనిని బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ ను తయారు చేసుకుని తినవచ్చు. వేసవి కాలంలో ఇలా బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు.