Palak Rajma Masala Curry : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో రాజ్మా కూడా ఒకటి. రాజ్మా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్లతో పాటు అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి. రాజ్మాను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాజ్మాతో మనం ఎన్నో రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. రాజ్మాతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. రాజ్మాతో చేసుకోదగిన రచికరమైన వంటకాల్లో పాలక్ రాజ్మా మసాలా కూర కూడా ఒకటి. పాలకూర, రాజ్మా వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ధాభా స్టైల్ లో ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ రాజ్మా మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన రాజ్మా – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, యాలకులు – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, టమాట పేస్ట్ – అర కప్పు, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, గరం మసాలా – ఒకటిన్నర టీ స్పూన్, పాలకూర తరుగు – 2 కప్పులు, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక చిన్న కట్ట, క్రీమ్ – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క.
పాలక్ రాజ్మా మసాలా కూర తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు, యాలకులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నానబెట్టుకున్న రాజ్మా, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిస్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మరలా స్టవ్ మీద ఉంచి పాలకూర తరుగు, కసూరీ మెంథీ, కొత్తిమీర వేసి కలపాలి.
దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత నిమ్మరసం వేసి కలపాలి. చివరగా క్రీమ్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ రాజ్మా మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రాజ్మాతో మసాలా కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.