Masala Poha : అటుకులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. అటుకులతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అటుకులతో చేసుకోదగిన వంటకాల్లో పోహ కూడా ఒకటి. పోహా మనందరికి తెలిసిందే. పోహ చాలా రుచిగా ఉంటుంది. అందరూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. తరచూ చేసే పోహా కాకుండా దీనిలో మసాలా పేస్ట్ వేసి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ మసాలా పోహాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పోహా తయారీకి కావల్సిన పదార్థాలు..
మందంగా ఉండే అటుకులు – రెండు కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 3 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర – అర కట్ట, పచ్చిమిర్చి- 2 లేదా 3, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
మసాలా పోహ తయారీ విధానం..
ముందుగా అటుకులను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వాటిలో నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని అరగంట పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పోషకాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి సగం వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత అటుకులు వేసి కలపాలి. ఇప్పుడు మంటను పెద్దగా చేసి అంతా చక్కగా కలిసే వరకు కలపాలి. తరువాత కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పోహ తయారవుతుంది. ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తినవచ్చు. ఈ విధంగా చేసిన పోహాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.