Chicken Kurma : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో చికెన్ కుర్మా కూడా ఒకటి. చికెన్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఈ కుర్మా చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ కు వెళ్లే పని లేకుండా ఈ చికెన్ కుర్మాను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ లో సులభంగా చికెన్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఫ్రైడ్ ఆనియన్స్ – ఒక కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, జాపత్రి – కొద్దిగా, యాలకులు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, మిరియాలు – పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, గరం మసాలా -అర టీ స్పూన్, కేవ్రా వాటర్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – రెండు టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, కాశ్మీరీ చిల్లీ కారం – 2 టీ స్పూన్స్, పెరుగు – 100 గ్రా..
చికెన్ కుర్మా తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత జార్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె, బటర్ వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. చికెన్ లోని నీరంతా పోయి నూనె పైకి తేలే వరకు దీనిని బాగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసికలపాలి.
దీనిని చిన్న మంటపై 2 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు, గరం మసాలా వేసి కలపాలి. తరువాత మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కేవ్రా వాటర్, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కుర్మా తయారవుతుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ తో వెరైటీగా చికెన్ కుర్మాను తయారు చేసుకుని తినవచ్చు. నాన్, బటర్ నాన్, రోటీ, పుల్కా, చపాతీ వంటి వాటితో తింటే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. ఒక్క ముక్క కూడా విడిచి పెట్టకుండా దీనిని అందరూ ఇష్టంగా తింటారు.