Instant Cool Badam Milk : బాదం పాలు.. వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది బాదం పాలను ఇష్టంగా తాగుతారు. ఈ పాలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే చాలా మంది ఈ పాలను ఖర్చు పెట్టి మరీ బయట కొనుగోలు చేసి తాగుతూ ఉంటారు. బయట కొనుగోలు చేసే పని లేకుండా మన ఇంట్లోనే చాలా సులభంగా ఈ పాలను తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ బాదం మిక్స్ ను తయారు చేసుకుని ఆ మిక్స్ తో కేవలం 5 నిమిషాల్లోనే మనం బాదం పాలను తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో చల్ల చల్లగా ఇలా బాదం పాలను తయారు చేసుకుని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇన్ స్టాంట్ బాదం మిక్స్ ను అలాగే ఈ మిక్స్ తో ఇన్ స్టాంట్ గా బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ బాదం మిక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదంపప్పు – ఒక కప్పు, జీడిపప్పు – పావు కప్పు, పిస్తా పప్పు -ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 7, పంచదార – ఒకటిన్నర కప్పు లేదా రెండు కప్పులు, పసుపు – అర టీ స్పూన్, కుంకుమ పువ్వు – చిటికెడు, పాలు – అర లీటర్.
ఇన్ స్టాంట్ బాదం మిక్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో బాదంపప్పు వేసి చిన్న మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఇందులోనే జీడిపప్పు, పిస్తా పప్పు వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పప్పులను ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. బాదంపప్పులు చల్లారిన తరువాత వీటిని నుండి 10 లేదా 15 బాదంపప్పులను తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కకు ఉంచాలి. మిగిలిన పప్పులను జార్ లో వేసి మధ్య మధ్యలో ఆపుతూ పొడిగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే యాలకులు, పంచదార, పసుపు వేసి పొడిగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి.
ఈ పంచదార పొడిని కూడా బాదం పొడిలో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత కుంకుమ పువ్వు వేసి మరోసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ బాదం మిక్స్ తయారవుతుంది. దీనిని తడి లేని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నుండి మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడితో బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో పాలను పోసి రెండు పొంగులు వచ్చే వరకు వేడి చేయాలి. పాలు వేడైన తరువాత నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల బాదం మిక్స్ ను వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై మరో 2 నిమిషాల పాటు కలుపుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాదం పాలు తయారవుతాయి.
వీటిని వేడి వేడిగా ఇలాగే తాగవచ్చు లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లారిన తరువాత కూడా తాగవచ్చు. ఈ విధంగా బాదం మిక్స్ ను తయారు చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు బాదం పాలను తాగవచ్చు. చిక్కటి పాలతో తయారు చేసుకోవడం వల్ల ఈ బాదంపాలు మరింత రుచిగా ఉంటాయి. అలాగే ఇందులో పంచదార బదులుగా పటిక బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. వేసవికాలంలో చల్ల చల్లగా ఈ పాలను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఎండ వల్ల కలిగే నీరసం నుండి బయటపడవచ్చు. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల మరింత మేలు కలుగుతుంది.