Carrot Junnu : క్యారెట్ లతో మనం అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్ పచ్చడి, హల్వా వంటి వాటితో పాటు రకరకాల వంటల్లో కూడా వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా క్యారెట్ తో మనం జున్నును కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా క్యారెట్ తో చేసే ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే ఈ జున్నును తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. క్యారెట్ లతో రుచిగా, కమ్మగా జున్నును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ జున్ను తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా ఉండే క్యారెట్స్ – పావు కిలో, బెల్లంతురుము – 250 గ్రా., యాలకులు – 3, బియ్యం పిండి – ఒక కప్పు, పాలు – ఒకటింపావు కప్పు.
క్యారెట్ జున్ను తయారీ విధానం..
ముందుగా క్యారెట్ చివర్లను తీసేసి వాటిపై ఉండే చెక్కును తీసేయాలి. తరువాత వాటిని శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. తరువాత ఈ క్యారెట్ లను 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి క్యారెట్ లను జార్ లో వేసుకోవాలి. తరువాత ఇదే జార్ లో బెల్లం తురుము, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి, పాలు పోసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కేక్ ట్రేలోకి లేదా స్టీల్ గిన్నెలోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పక్కకు ఉంచాలి.
తరువాత కుక్కర్ లో స్టాండ్ ను ఉంచి అది మునిగే వరకు నీటిని పోసుకోవాలి. తరువాత ఇందులో మూతతో సహా క్యారెట్ మిశ్రమాన్ని ఉంచిన గిన్నెను ఉంచాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో ఉంచిన గిన్నెను బయటకు తీసి చల్లారనివ్వాలి. తరువాత దీనిని గిన్నె నుండి వేరు చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మనకు కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ జున్ను తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా క్యారెట్ లతో జున్నును తయారు చేసుకుని తినవచ్చు.