Aloo Bajji : సాయంత్రం సమయంలో చాలా మంది అనేక రకాల స్నాక్స్ తింటుంటారు. ఎక్కువగా బజ్జీలు, పునుగులు, బొండాలు, వడలను తింటారు. అయితే బజ్జీల్లో మనకు అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో ఆలు బజ్జీ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని బయట విక్రయిస్తుంటారు. కానీ కాస్త శ్రమిస్తే చాలు.. బయట బండ్లపై లభించే లాంటి రుచి వచ్చేలా ఇంట్లోనే ఎంతో సులభంగా ఆలు బజ్జీలను తయారు చేయవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలు బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆలుగడ్డలు పెద్దవి – 2, శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, కారం – ఒక టీస్పూన్, పసుపు – అర టీస్పూన్, జీలకర్ర పొడి – అర టీస్పూన్, బేకింగ్ సోడా – అర టీస్పూన్, ఉప్పు – రుచికి తగినంత, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
పిండిని తయారు చేసే విధానం..
ఒక పాత్రలో శనగపిండి, బియ్యం పిండి, కారం, పసుపు, జీలకర్ర పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లను పోసుకుంటూ నెమ్మదిగా కలపాలి. పిండి బజ్జీలు వేసేందుకు అనువుగా వచ్చే వరకు నీళ్లు పోస్తూ పిండిని కలపాలి. తరువాత బజ్జీలను వేసుకోవచ్చు.
ఆలు బజ్జీలను తయారు చేసే విధానం..
ఆలుగడ్డలు పొట్టు తీసి వాటిని మందంగా గుండ్రంగా వచ్చేలా కట్ చేయాలి. వీటిని మరీ మందంగా కాకుండా చూసుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. మంటను మీడియం ఉంచాలి. దీంతో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలు గడ్డ ముక్కలను ముందుగా సిద్ధం చేసుకున్న పిండిలో బాగా ముంచాలి. పిండి ముక్కకు అంతా పట్టేలా బాగా ముంచి తీయాలి. తరువాత ఆ ముక్కను నెమ్మదిగా కాగిన నూనెలో వేయాలి. ఇలా కొన్ని ముక్కలను ఒకేసారి నూనెలో వేసి ఫ్రై చేసుకోవచ్చు. దీంతో బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారి కరకరలాడుతాయి. ఈ సమయంలో వీటిని తీయవచ్చు.
ఇలా బజ్జీలు బాగా కాలేవరకు వాటిని అటు ఇటు తిప్పుతూ వేయించాలి. అనంతరం ముక్కలను బయటకు తీసి టిష్యూ ఉంచిన ప్లేట్‌లో వేయాలి. దీంతో అదనంగా ఉండే నూనె బయటకు పోతుంది. ఇలా అన్ని ముక్కలను బజ్జీల్లా వేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ఆలు బజ్జీలు తయారవుతాయి. వీటిని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇలా ఓపికగా చేస్తే బయట బండ్లపై లభించే లాంటి టేస్ట్ వస్తాయి. అందరూ ఇష్టపడతారు. వీటిని సాస్ లేదా ఏదైనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.