Sugar Test : ప్రస్తుత తరుణంలో చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. ఇది టైప్ 1 లేదా 2 గా వస్తోంది. ఎక్కువ శాతం మంది అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే దీంతో జీవితాంతం అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే టైప్ 1 ను నయం చేయలేం కానీ.. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే టైప్ 2 డయాబెటిస్ నుంచి బయట పడవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు. అందుకు గాను ముఖ్యమైన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక షుగర్ విషయంలో చాలా మందికి ఎన్నో అపోహలు వస్తుంటాయి. ముఖ్యంగా తినక ముందు.. తిన్న తరువాత.. అసలు షుగర్ ఎంత ఉండాలి. ఎంత మోతాదు దాటితే ప్రమాదం.. వంటి విషయాలపై చాలా మంది అనుమానపడుతుంటారు. ఈ క్రమంలోనే ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
తినక ముందు షుగర్ టెస్ట్ అంటే క్రితం రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నడుమ గ్యాప్ కనీసం 8 నుంచి 12 గంటలు ఉండాలి. ఈ స్థితిలో చేసే షుగర్ టెస్ట్‌ను ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ (ఎఫ్బీఎస్) అంటారు. ఈ టెస్ట్ చేసినప్పుడు ఫలితం 70 నుంచి 100 మధ్య రావాలి. అప్పుడు షుగర్ సాధారణ స్థితిలో ఉన్నట్లు లెక్క. అలా కాకుండా 100 నుంచి 125 మధ్య వస్తే డయాబెటిస్ రాబోతుందని అర్థం. 125 మీద ఎంత వచ్చినా డయాబెటిస్ బాధితులుగా గుర్తించాలి.
ఇక తిన్న తరువాత చేసే షుగర్ టెస్ట్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ టెస్ట్ (పీపీబీఎస్) అంటారు. తిన్న తరువాత కనీసం 2 గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తరువాత ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇందులో ఫలితం 70 నుంచి 140 మధ్య రావాలి. అప్పుడు షుగర్ లెవల్స్ సాధారణ స్థితిలో ఉన్నట్లు అర్థం. అలా కాకుండా ఎక్కువగా వస్తే అప్పుడు షుగర్ ఉన్నట్లు నిర్దారించుకోవాలి. ఇలా షుగర్ టెస్ట్ ఫలితాలు ఉంటాయి. కనుక షుగర్ టెస్ట్‌ను ఈ విధంగా పూర్తిగా అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే అప్పుడు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవడం తేలికవుతుంది. లేదంటే షుగర్ కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం.