Tomato Biryani : మనం వంటింట్లో రకరకాల బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాము. నాన్ వెజ్ తో చేసే బిర్యానీలే కాకుండా కూరగాయలతో కూడా బిర్యానీని తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోగలిగినరుచికరమైన బిర్యానీలలో టమాట బిర్యానీ కూడా ఒకటి. టమాటాలతో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా ఈ టమాట బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, లవంగాలు – 3, యాలకులు – 4, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, స్టోన్ ప్లవర్ – 1, జాపత్రి – కొద్దిగా, జీడిపప్పు – 10, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన క్యారెట్ – 1, తరిగిన బీన్స్ – 10, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన బంగాళాదుంప – పెద్దది ఒకటి, చిన్నగా తరిగిన పెద్ద టమాటాలు – 3, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, నానబెట్టిన బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్.
టమాట బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత బీన్స్, క్యారెట్, బంగాళాదుంప వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడి వరకు వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత బియ్యం, నీళ్లు పోసి కలపాలి.
తరువాత ఉప్పు, కారం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట బిర్యానీ తయారవుతుంది. దీనిని మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా టమాటాలతో చేసిన ఈ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.