Champaran Mutton : మాంసాహార ప్రియులకు మటన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ నుఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మటన్ తో మనం ఎక్కువగా కూరను వండుతూ ఉంటాం. మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. తరచూ చేసే విధంగా కాకుండా ఈ మటన్ కర్రీని బీహర్ లోని చంపారన్ ప్రాంతంలో తయారు చేసినట్టుగా మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత మటన్ – కిలో, ఉల్లిపాయలు – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – అరకిలో, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 10, అల్లం పేస్ట్ -1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్, పచ్చి బొప్పాయి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 3, బిర్యానీ ఆకులు – 2, మిరియాలు -ఒక టీ స్పూన్, లవంగాలు – 3, నల్ల యాలక్కాయ – 1,జాపత్రి – కొద్దిగా, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, తోక మిరియాలు – 5, యాలకులు – 3, అనాస పువ్వు – 1,ఉప్పు – తగినంత, కారం – 2 లేదా 3 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కాశ్మీరీ చిల్లీ కారం – 2 టీ స్పూన్స్, గరం మసాలా -ఒక టీ స్పూన్, సోంపు గింజల పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, పెరుగు – అర కప్పు, ఆవాల నూనె – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పక్కకుఉంచాలి. తరువాత వెల్లుల్లిరెబ్బలను వలచకుండా మొత్తం వెల్లుల్లి పాయను అలాగే కూరలో వేసుకోవాలి. అయితే ముందుగా వీటిపై ఉండే పొట్టును తీసేయాలి. తరువాత లోపల బూసు లేకుండా చూసుకుని నీటిలో వేసి కడిగి పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో నూనె, పెరుగు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత వెల్లుల్లి పాయలు, మటన్ వేసి కలపాలి. ఇప్పుడు గిన్నెలో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనెను పొగలు వచ్చే వరకు వేడి చేసిన తరువాత ఇందులో ముప్పావు వంతు నూనెను ముందుగా సిద్దం చేసుకున్న మటన్ లో వేసి కలపాలి.
ఇప్పుడు లోతుగా ఉండే మట్టి పాత్రను తీసుకుని అందులో మిగిలిన ఆవ నూనెను వేసుకోవాలి. తరువాత మటన్ ను వేసి పైన సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా గోధుమపిండిని ఉంచి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ గిన్నెను నిప్పుల మీద ఉంచి ముప్పావు గంట నుండి గంట పాటు ఉడికించాలి. నిప్పుల మీద వండడం ఇప్పుడు సాధ్యం కాదు కనుక స్టవ్ మీద మొదటి 5 నిమిషాలు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి అరగంట పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మూత తీసి మరోసారి అంతా కలుపుకోవాలి. అడుగు మాడిపోకుండా అవసరమైతే కొద్దిగా నీళ్లను పోసుకుని మూత పెట్టి మటన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ తయారవుతుంది. మటన్ తో పాటు వెల్లుల్లిని కూడా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. చపాతీ, అన్నంతో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.