Honey : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే తేనెను ఉపయోగిస్తున్నారు. అనేక రకాల వ్యాధులను నయం చేసేందుకు దీనిని వాడుతారు. తేనె మనకు పోషకాలను అందించడమే కాదు.. శక్తిని కూడా ఇస్తుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. అయితే తేనె వల్ల లాభాలు కలుగుతాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ పలు అనారోగ్య సమస్యలకు దాన్ని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలు చాలా మందికి తెలియవు. ఈ క్రమంలోనే తేనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె మనకు కలిగే స్వల్ప అనారోగ్య సమస్యలను నయం చేయగలదు. ఇందుకు గాను తేనెను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తాగాలి. దీంతో గొంతును కూడా పుక్కిలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి. గొంతు నొప్పి, దురద, మంట, దగ్గు వంటివి తగ్గుతాయి. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి రోజుకు మూడు సార్లు తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది. దీంతోపాటు ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూకస్ బయటకు వచ్చేస్తుంది. ఇది జలుబును తగ్గిస్తుంది. ఎంతో ఉపశమనాన్ని అందిస్తుంది.
తేనె జీర్ణ సమస్యలకు కూడా చక్కగా పనిచేస్తుంది. ఇందుకు గాను తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మాంసాహారం తిన్నప్పుడు జీర్ణమయ్యేందుకు ఈ చిట్కా పాటించవచ్చు. అలాగే ఈ మిశ్రమం వల్ల బరువు తగ్గుతారు. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి ఉండవు. అన్ని జీర్ణ సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు. తేనెను గాయాలు, దెబ్బలు, పుండ్లను నయం చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. వాటిపై తేనెను రోజుకు రెండు సార్లు రాస్తుంటే చాలు.. వెంటనే అవి తగ్గిపోతాయి. తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇన్ఫెక్షన్లు రావు. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి.
మొటిమలను తగ్గించేందుకు, చర్మ కాంతిని పెంచేందుకు, మచ్చలను తొలగించేందుకు కూడా తేనె పనిచేస్తుంది. ఇందుకు తేనెను ఎలా వాడాలంటే.. కొద్దిగా తేనెను తీసుకుని చర్మంపై నేరుగా రాయాలి. సున్నితంగా మర్దనా చేయాలి. 15 నిమిషాల పాటు ఉండి కడిగేయాలి. ఇలా రోజూ చేయాలి. దీంతో వారం రోజుల్లోనే చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. అలాగే చర్మంపై ఉండే దద్దుర్లు, దురదలు కూడా తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ఇది పొడి చర్మం ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయాలి. తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. చర్మానికి మృదుత్వం లభిస్తుంది. సీజనల్గా వచ్చే అలర్జీలను తగ్గించడంలోనూ తేనె పనిచేస్తుంది. ఇందుకు గాను తేనెను నిత్యం ఏదో ఒక రూపంలో ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీంతో అన్ని రకాల అలర్జీలు తగ్గుతాయి.
తేనె ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దీన్ని వైద్యుల సలహా మేరకు వాడుకోవడం మంచిది. కొందరిలో తేనె అలర్జీలను కలిగిస్తుంది. కనుక డాక్టర్ సూచన మేరకు దీన్ని వాడుకుంటే అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చు.