Nannari Sarbath : నన్నారి సిరప్.. మనకు సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ లో ఇది విరివిరిగా లభిస్తుంది. ఈ నన్నారి సిరప్ ను వట్టివేరు, అతి మధురం వేర్ల నుండి తయారు చేస్తారు. దీనిని సుగంధపాల అని కూడా అంటారు. దీనిలో ఎటువంటి రసాయనాలను కలపరు. నన్నారి సిరప్ ను వాడడం వల్ల శరీరంలో చల్లబడుతుంది. రక్తం శుద్ది అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ప్ తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది. వేసవికాలంలో ఎక్కువగా ఈ సిరప్ తో షర్బత్ ను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. నన్నారి సిరప్ తో షర్బత్ ను తయారు చేయడం చాలా సులభం. కేవలం 5 నిమిషాల్లోనే ఈ షర్బత్ ను తయారు చేసుకోవచ్చు. నన్నారి షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నన్నారి షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నన్నారి సిరప్ – 3 టేబుల్ స్పూన్స్, నిమ్మకాయ – అర చెక్క, నానబెట్టిన సబ్జా గింజలు – ఒక టేబుల్ స్పూన్.
నన్నారి షర్బత్ తయారీ విధానం..
ముందుగా ఒక గ్లాస్ లో నన్నారి సిరప్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం, సబ్జా గింజలు వేసుకోవాలి. తరువాత గ్లాస్ నిండుగా చల్లటి నీటిని పోసి కలపాలి. ఇలా చేయడం వల్ల నన్నారి షర్బత్ తయారవుతుంది. ఇందులో నీటికి బదులుగా సోడాను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నన్నారి షర్బత్ ను తయారు చేసుకుని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. మూత్రంలో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. డయేరియాతో బాధపడే వారు ఈ షర్బత్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వేసవికాలంలో ఈ షర్బత్ ను తాగడం వల్ల మరిన్ని ఫలితాలు ఉంటాయి.