Jonna Pittu : జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. జీర్ణవ్యస్థ మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన ఐరన్ లభిస్తుంది. ఈ విధంగా జొన్నలను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జొన్నలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నలతో చేసుకోదగిన రుచికరమైన పాత కాలపు వంటకాల్లో జొన్న పిట్టు కూడా ఒకటి. జొన్న పిట్టు చాలా రుచిగా ఉంటుంది. పూర్వకాలంలో దీనిని ఎక్కువగా తయారు చేసుకునే వారు. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిఒక్కరు దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. శరీరానికి బలాన్ని, పుష్టిని అందించే ఈ జొన్న పిట్టును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న పిట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నలు – 2 కప్పులు, ఉప్పు – రెండు చిటికెలు, యాలకులు – 4, ఎండు కొబ్బరి చిప్ప – చిన్నది ఒకటి, బెల్లం తురుము -ఒక కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్.
జొన్న పిట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జొన్నలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 8 నుండి 10గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ జొన్నలను వస్త్రంపై వేసి తడి పోయే వరకు ఆరబెట్టుకోవాలి. తరువాత ఈ జొన్నలను జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక జల్లి గిన్నెను తీసుకుని అందులో నీటిలో తడిపి పిండిన కాటన్ వస్త్రాన్ని ఉంచాలి. తరువాత దీనిపై మిక్సీ పట్టుకున్న జొన్న మిశ్రమాన్ని వేసి పైన సమానంగా చేసుకోవాలి. తరువాత మధ్య మధ్యలో చిన్న రంధ్రాలు చేసుకుని ఈ మిశ్రమాన్ని వస్త్రంతో మూసివేయాలి. తరువాత కుక్కర్ లో ఒక లీటర్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ జల్లిగిన్నెను కుక్కర్ మీద ఉంచి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టాలి. తరువాత దీనిని మధ్యస్థ మంటపై 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత రోట్లో యాలకులు, కొబ్బరి ముక్కలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బెల్లం తీసుకోవాలి. ఇందులోనే ఉడికించిన జొన్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నెయ్యి, దంచిన కొబ్బరి వేసి ఉండలు లేకుండా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల జొన్న పిట్టు తయారవుతుంది. దీనిని నేరుగా గిన్నెలో వేసుకుని తినవచ్చు లేదా లడ్డూలుగా చుట్టుకుని కూడా తినవచ్చు. ఈ జొన్న పిట్టును పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి చక్కటి ఆరోగ్యాన్ని అందించిన వారమవుతాము. అలాగే స్త్రీలు దీనిని తీసుకోవడం వల్ల వారిలో రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరం ధృడంగా తయారవుతుంది.