Meka Kalla Pulusu : మాంసాహార ప్రియులకు మటన్ పాయ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలాగే పాయను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పాయను తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తినాలని ఉన్నా పాయను సులభంగా ఎలా వండాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు అలాగే మొదటి సారి వండే వారు ఇలా కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా రుచిగా చాలా సులభంగా పాయను వండుకోవచ్చు. రుచిగా, సులభంగా మటన్ పాయను ఎలా వండుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ పాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
మేక కాళ్లు – 4, మిరియాలు – 12, యాలకులు – 4, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ధనియాలు -ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, నీళ్లు – ఒక లీటర్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ పాయ తయారీ విధానం..
ముందుగా మేకకాళ్లపై ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. వీటిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత నీటితో చక్కగా శుభ్రం చేసి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ లాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి.
దీనిని రంగు మారే వరకు వేయించిన తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత శుభ్రం చేసుకున్న పాయ వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించిన తరువాత మంటను చిన్నగా చేసి పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి పొడి, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మసాలాలు మాడి పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి. మంటను మధ్యస్థంగా చేసి 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన తరువాత మూత తీయాలి. పాయ మెత్తగా ఉడికితే కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. లేదంటే మరో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే పులుసు పలుచగా ఉంటే మూత తీసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా మరి కొద్దిగా కొత్తిమీరను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాయ తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ, చపాతీ, సంగటి ఇలా దేనితోనైనా తినవచ్చు. ఈ విధంగా పాయను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.