Ullikaram Chukka Kura : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో చుక్కకూర కూడా ఒకటి. చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని వండుకుని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చుక్కకూరతో మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఉల్లికారం వేసి ఈ చుక్క కూరను మరింత రుచిగా సులభంగా ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లికారం చుక్క కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
చుక్క కూర – 3 కట్టలు, ఉల్లిపాయలు – 3 ( మధ్యస్దంగా ఉన్నవి), వెల్లుల్లి రెబ్బలు – 10, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన టమాటాలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – పావు టీ స్పూన్.
ఉల్లికార చుక్క కూర తయారీ విధానం..
ముందుగా చుక్క కూరను చిన్నగా తరిగి శుభ్రం చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పసుపు, టమాట ముక్కలు వేసి కలపాలి.
తరువాత తరిగిన చుక్కకూర వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మెత్తబడే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు మాడకుండా టమాట ముక్కలు, చుక్కకూర మెత్తబడే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లికారం చుక్కకూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.