Royyala Biryani : రొయ్యలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రొయ్యలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల బిర్యానీ కూడా ఒకటి. రొయ్యల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే రొయ్యల బిర్యానీ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయాలంటే చాలా మంది శ్రమతో, ఎక్కువ సమయంతో కూడుకున్న పని అని దీనిని ఇంట్లో తయారు చేయడమే మానేస్తూ ఉంటారు. కానీ అర గంటలోనే రుచికరమైన చూడగానే తినాలనిపించే రొయ్యల బిర్యానీని ఎలాంటి శ్రమ లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా దీనిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో , రుచిగా రొయ్యల బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
15 నిమిషాల పాటు నానబెట్టిన బియ్యం – 2 గ్లాసులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నల్ల యాలకులు – 2, యాలకులు – 3, లవంగాలు – 5, దాల్చిన చెక్క – ఇంచు ముక్క, జాపత్రి – కొద్దిగా, అనాస పువ్వు – 1, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, తరిగిన టమాటాలు – 2, కారం – 2 టీ స్పూన్స్, బిర్యానీ మసాలా – ఒక టీ స్పూన్, గరం మసాలా -ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్, తరిగిన పుదీనా 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 3 గ్లాసులు.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన రొయ్యలు -అరకిలో, వెల్లుల్లి రెబ్బలు – 15, అల్లం – 2 ఇంచుల ముక్క, పచ్చిమిర్చి – 5, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర చెక్క, పసుపు – పావు టీ స్పూన్.
రొయ్యల బిర్యానీ తయారీ విధానం..
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని రొయ్యలల్లో వేసి కలపాలి. అలాగే మిగిలిన పదార్థాలు కూడా వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు రొయ్యలను మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత బియ్యం, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. మసాలాలు మాడిపోకుండా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి.
ఇలా వేయించిన తరువాత బియ్యం వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పెద్ద మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి అంతా కలుపుకుని మరో 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ రొయ్యల బిర్యానీని ఉల్లిపాయ ముక్కలు, రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా రొయ్యలతో ఎంతో రుచికరమైన బిర్యానీని నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్, స్పెషల్ డేస్ లో ఇలా అప్పటికప్పుడు రుచికరమైన రొయ్యల బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు.