Aloo Kootu : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంపలను ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ కూటు కర్రీ కూడా ఒకటి. చక్కటి రుచితో, ఎక్కువ గ్రేవీతో ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే దేనితో తినడానికైనా ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచికరమైన ఈ ఆలూ కూటీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ కూటు కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్, అర గంట పాటు నానబెట్టిన గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, యాలకులు – 3, దాల్చిన చెక్క – చిన్న ముక్క.
ఆలూ కూటు కర్రీ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని మధ్యస్థంగా ఉండే ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు కూడా వేసి ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి 80 శాతం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. తరవుఆత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
తరువాత స్టవ్ ను చిన్నగా చేసి పెరుగు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. గ్రేవీ ఉడుకుపట్టిన తరువాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కూటు కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.