Special Bread Sweet : మనం బ్రెడ్ తో రకరకాల తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. బ్రెడ్ తో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బ్రెడ్ తీపి వంటకాలను తయారు చేయడం కూడా చాలా సులభం. కింద చెప్పిన విధంగా బ్రెడ్ తో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఒక్కసారి దీనిని రుచి చూసారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా, రుచిగా ఉండే బ్రెడ్ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 6, కార్న్ ఫ్లోర్ -ఒక టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – తగినన్ని, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, సన్నటి సేమ్యా – అర కప్పు, చిక్కటి పాలు – అరలీటర్, నీళ్లు – అర గ్లాస్, కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార – 4 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత, యాలకులు పొడి – అర టీ స్పూన్.
బ్రెడ్ స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్ ను వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ను పాలు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా బ్రెడ్ మిశ్రమాన్ని తీసుకుంటూ గుండ్రంగా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత బ్రెడ్ బాల్స్ ను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో సేమ్యా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పాలు, నీళ్లు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత సేమ్యా వేసి ఉడికించాలి. సేమ్యా చక్కగా ఉడికిన తరువాత ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ ను తీసుకుని కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని మరుగుతున్న పాలల్లో వేసి కలపాలి.
ఈ పాలను చిక్కబడే వరకు కలిపిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని చల్లారే వరకు అలాగే ఉంచాలి. పాల మిశ్రమం చల్లారిన తరువాత వేయించిన బ్రెడ్ బాల్స్ వేసి కలపాలి. దీనిని ఫ్రిజ్ లో వేసి చల్లారిన తరువాత కూడా తీసుకోవచ్చు లేదా గిన్నెలో వేసుకుని పైన తరిగిన డ్రై ఫ్రూట్స్ ను చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన బ్రెడ్ స్వీట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే ఈ బ్రెడ్ స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు.