Karivepaku Rice : కరివేపాకు మనందరికి తెలిసిందే. దీనిని వంటల్లో విరివిరిగా వాడుతూ ఉంటాము. కరివేపాకును వాడడం వల్ల మన జుట్టుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కరివేపాకును వంటల్లో వాడడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వంట్లలో వాడడంతో పాటు ఈ కరివేపాకుతో చక్కటి రైస్ ఐటమ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కరివేపాకు రైస్ ను ఇన్ స్టాంట్ గా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ కరివేపాకు రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – పావు కిలో బియ్యంతో వండినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు -ఒక రెమ్మ, ఇంగువ – కొద్దిగా, ఉప్పు- తగినంత.

కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు -ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – ఒక రెమ్మ, నువ్వులు – ఒక టీ స్పూన్, కరివేపాకు – గుప్పెడు.
కరివేపాకు రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కారం పొడికి కావల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా చిన్న మంటపై కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఇవన్ని చక్కగా వేగిన తరువాత అన్నం వేయాలి. తరువాత ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు రైస్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నం మిగిలినప్పుడు దానిని పడివేయకుండా ఇలా రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.