Kakarakaya Karam : కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. చేదుగా ఉన్నప్పటికి వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కాకరకాయ వేపుడు, పులుసు, కూరలే కాకుండా కాకరకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ కారాన్ని తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసేవారు కూడా ఈ కారాన్ని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా తిన్నా కొద్ది తినాలనిపించే ఈ కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – 400 గ్రా., నూనె – ఒక కప్పు, పల్లీలు – పావు కప్పు, కరివేపాకు -ఒక గుప్పెడు, ఉప్పు- తగినంత, వెల్లుల్లి పాయ -1, కారం – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, చింతపండు – చిన్న నిమ్మకాయంత, జీలకర్ర – పావు టీ స్పూన్.
కాకరకాయ కారం తయారీ విధానం..
ముందుగా కాకరకాయలను గుండ్రంగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాడిపోకుండా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలను వేయించుకున్న తరువాత అదే నూనెలో పల్లీలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.తరువాత కరివేపాకును కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఒక జార్ లో వేయించిన కాకరకాయ ముక్కలు, ముందుగా వేయించిన పల్లీలు ఒక టీ స్పూన్, వేయించిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారం, చింతపండు, జీలకర్ర వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో వేయించిన పల్లీలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కారం తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కాకరకాయ కారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.