Egg Masala Gravy : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే కోడిగుడ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కోడిగుడ్లల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడిగుడ్లతో తరచూ చేసే వంటకాలతో పాటు ఎంతో ఎంతో రుచిగా ఉండే మసాలా గ్రేవీ కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. కోడిగుడ్లతో రుచిగా, సులభంగా మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ మసాలా గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – పావు కప్పు, చింతపండు రసం -అర కప్పు, ఉడికించిన కోడిగుడ్లు – 4.
ఎగ్ మసాలా గ్రేవీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి దోరగా వేగిన తరువాత గసగసాలు, నువ్వులు వేసి వేయించాలి. తరువాత ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి.
తరువాత పావు కప్పు నీళ్లు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత చింతపండు రసం, మరో పావు కప్పు నీళ్లు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుని వేసుకోవాలి. వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల రుచితో పాటు కోడిగుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ విధంగా తయారు చేసిన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.