Spicy Egg Rice : మనం తరచూ చేసే రైస్ వెరైటీలలో ఎగ్ రైస్ కూడా ఒకటి. ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లల్లోకి కూడా ఈ ఎగ్ రైస్ చాలా చక్కగా ఉంటుంది. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు చాలా మంది ఎగ్ రైస్ ను తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఈ ఎగ్ రైస్ ను తరచూ ఒకేలా కాకుండా మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. 10 నుండి 15 నిమిషాల వ్యవధిలో చాలా సులభంగా మరింత రుచిగా మనం ఈ ఎగ్ రైస్ ను తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా మరింత టేస్టీగా స్పైసీగా ఈ ఎగ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ ఎగ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు -ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన బీన్స్ – 4, తరిగిన టమాట -1, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, చికెన్ మసాలా పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కోడిగుడ్లు – 3, అన్నం – 2 కప్పులు, మిరియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
స్పైసీ ఎగ్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత క్యారెట్, బీన్స్, క్యాప్సికం వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ఈ ముక్కలను పక్కకు అని కోడిగుడ్లను వేసుకోవాలి. ఈ కోడిగుడ్లను వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత అన్నం, కొత్తిమీర, మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ ఎగ్ రైస్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ స్పైసీ ఎగ్ రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.