Saggubiyyam Java : సగ్గుబియ్యం.. ఇవి మనందరికి తెలిసినవే. ఎంతో కాలంగా వీటిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాము. సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని వీటిని ఎక్కువగా వేసవి కాలంలో తీసుకుంటూ ఉంటారు. సగ్గుబియ్యంతో ఎక్కువగా పాయసం, కిచిడి, సగ్గుబియ్యం వడ వంటి వాటితో పాటు ఇతర వంటకాల తయారీలో కూడా వాడుతూ ఉంటారు. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సగ్గుబియ్యంలో పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.
అయితే సగ్గుబియ్యంతో ఇతర వంటకాలకు బదులుగా జావను చేసి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సగ్గుబియ్యం జావను తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ జావను తయారు చేసుకోవడానికి గానూ రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ సగ్గుబియ్యాన్ని నీరంతా పోయి మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో ఒక గ్లాస్ వేడి పాలు, ఒక టీ స్పూన్ బెల్లం తురుము వేసి బెల్లం కరిగే వరకు కలపాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం జావ తయారవుతుంది.
దీనిని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇలా సగ్గుబియ్యం జావను తయారు చేసి తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. అంతేకాకుండా సగ్గుబియ్యం జావను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. అలాగే షుగర్ తో బాధపడే వారు ఇందులో ఇందులో బెల్లాన్ని కలపకుండా తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ జావను తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. బలహీనత, నీరసం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వారు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ జావను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా సగ్గుబియ్యం జావ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.