Tomato Kothimeera Pachadi : మనం ఇంట్లో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కొన్ని రకాల పచ్చళ్లను అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా కలిపి తినవచ్చు. మనం రుచిగా, సులభంగా చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో టమాట కొత్తిమీర పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చక్కటి రుచి, వాసన కలిగి ఉండే టమాట కొత్తిమీర పచ్చడి తయారీ విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కొత్తిమీర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – పావు కప్పు, నూనె -ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, టమాట ముక్కలు -పావుకిలో, పచ్చిమిర్చి – 5, తరిగిన కొత్తిమీర – ఒక పెద్ద కట్ట, అల్లం తరుగు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
టమాట కొత్తిమీర పచ్చడి తయారీ విధానం..
ముందుగా పల్లీలను వేయించి పొట్టు తీసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత కొత్తిమీర వేసి కలపాలి. మరలా మూతపెట్టి కొత్తిమీరను, టమాట ముక్కలను పూర్తిగా మగ్గించాలి. తరువాత అల్లం తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో పల్లీలు తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వేయించిన టమాట, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కొత్తిమీర పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని తినవచ్చు. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు చాలా తక్కువ సమయంలో, రుచిగా టమాట కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు.