Saggubiyyam Idli : మనం సగ్గుబియ్యంతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సగ్గుబియ్యం మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సగ్గుబియ్యంతో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే తరచూ చేసే వంటకాలతో పాటు మనం సగ్గుబియ్యంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీను కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యం, ఇడ్లీ రవ్వ కలిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు, బీపీ ఉన్న వారు, గర్భిణీ స్త్రీలు ఈ ఇడ్లీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ సగ్గుబియ్యం ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
6 గంటల పాటు ననాబెట్టిన జొన్న రవ్వ – ఒక కప్పు, 4 గంటల పాటు నానబెట్టిన సగ్గుబియ్యం – పావు కప్పు, ఉప్పు లేదా సైంధవ లవణం – తగినంత, పుల్లటి పెరుగు – పావు కప్పు, క్యారెట్ తురుము – అర కప్పు.
సగ్గుబియ్యం ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇదే జార్ లో జొన్న రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, ఉప్పు, క్యారెట్ తురుము వేసి కలపాలి. ఇప్పుడు పిండిని ఇడ్లీ ప్లేట్ లలో వేసుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో ఒక గ్లాస్ నీటిని పోసి అందులో ప్లేట్ లను ఉంచి మూత పెట్టి ఉడికించాలి. ఈ ఇడ్లీలను 8 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 4 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఇడ్లీ ప్లేట్ లను బయటకు తీసి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం ఇడ్లీ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీలను కారం పొడి, సాంబార్ తో కూడా తినవచ్చు. ఇలా సగ్గుబియ్యంతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా చక్కటి ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు.