Soft Ravva Laddu : మనం బొంబాయి రవ్వతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో రవ్వ లడ్డూలు కూడా ఒకటి. రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా మంది రవ్వ లడ్డూలను ఇష్టంగా తింటారు. అయితే తరచూ ఒకే రకం రవ్వ లడ్డూలు కాకుండా కింద చెప్పిన విధంగా చేసే మెత్తటి రవ్వ లడ్డూలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఒకేసారి వీటిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. ఈ మెత్తటి రవ్వ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సున్నితంగా ఉండే ఈ రవ్వ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
రవ్వ – ఒక గ్లాస్, ఉప్పు -చిటికెడు, పాలు – అర గ్లాస్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఎండు కొబ్బరి ముక్కలు – గుప్పెడు, పంచదార – అర గ్లాస్ లేదా తగినంత, యాలకుల పొడి -అర టీ స్పూన్, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, కాచి చల్లార్చిన పాలు – కొద్దిగా.
రవ్వ లడ్డూ తయారీ విధానం..
ముందుగా రవ్వలో ఉప్పు వేసి కలపాలి. తరువాత పాలు పోసి కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పునుగుల్లా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే కళాయిలో ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత రవ్వ పునుగులను, ఎండు కొబ్బరి ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి.
తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తరువాత వీటిని నెయ్యితో సహా రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత ఇందులో యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కమ్మగా ఉండే రవ్వ లడ్డూలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా సులభంగా, రుచిగా, చాలా తక్కువ సమయంలో రవ్వ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.