Paneer At Home : పనీర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలతో చేసే ఈ పనీర్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. పనీర్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కండరాలు బలంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. పనీర్ ను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గర్భిణీ స్త్రీలు పనీర్ ను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పనీర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.
చాలా మంది పనీర్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. సాధారణంగా మనం పనీర్ ను బయట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా ఎంతో మృదువుగా చక్కగా ఉండే ఈ పనీర్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పనీర్ ను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో పాలు ఉండే చాలు మనం పనీర్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పనీర్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో చిక్కటి లీటర్ పాలను తీసుకుని పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. పాలు పొంగు వచ్చిన తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. కొద్ది సమయానికి పాలు విరిగిపోతాయి.
పాల విరుగుడు, నీళ్లు వేరవగానే స్టవ్ ఆఫ్ చేసి నీరంతా పోయేలా వడకట్టాలి. తరువాత ఈ పాల విరుగుడును చల్లటి నీటితో కడిగి శుభ్రమైన వస్త్రంలోకి తీసుకుని నీరంతా పోయేలా పిండుతూ గట్టిగా మూట కట్టాలి. తరువాత దీనిపై ఏదైనా బరువైన వస్తువును పెట్టి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల నీరంతా పోయి పనీర్ గట్టిపడుతుంది. తరువాత మూట విప్పి పనీర్ ను మతూ ఉండే డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా గంట పాటు ఉంచిన తరువాత పనీర్ ను బయటకు తీసి వంటల్లో వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనం ఇంట్లోనే చాలా సులభంగా పనీర్ ను తయారు చేసుకోవచ్చు.