Chamagadda Vepudu : మనం చామగడ్డలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామగడ్డలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, కంటిచూపు పెరిగేలా చేయడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా చామగడ్డలు మనకు దోహదపడతాయి. వీటిని కూడా మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. చామగడ్డలతో మనం ఎక్కువగా పులుసు, కూర, వేపుడు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. చామగడ్డ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చామగడ్డ వేపుడును మరింత రుచిగా, క్రిస్పీగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చామగడ్డ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చామగడ్డలు – అరకిలో, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు -ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – పావు టీ స్పూన్ లేదా తగినంత.
చామగడ్డ వేపుడు తయారీ విధానం..
ముందుగా చామగడ్డలను శుభ్రంగా కడిగి కుక్కర్ లోకి తీసుకోవాలి. తరువాత అవి మునిగే వరకు నీటిని పోసి మూత పెట్టాలి. ఈ చామగడ్డలను పెద్ద మటంపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చామగడ్డ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వేయించిన చామగడ్డ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చామగడ్డ వేపుడు తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. చామగడ్డలను తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు.