Aloo Manchuria : మనం బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ మంచురియా కూడా ఒకటి. రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఆలూ మంచురియా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు రుచిగా ఆలూ మంచురియాను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ మంచురియాను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మంచురియా తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యూబ్స్ లాగా తరిగిన బంగాళాదుంపలు – 2, మైదాపిండి – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఉప్పు -తగినంత, కారం లేదా కాశ్మీరి కారం – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
టాసింగ్ కు కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 2, పొడుగ్గా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ మంచురియా తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను నీటిలో వేసి 50 శాతం ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
తరువాత చిల్లీ సాస్, సోయా సాస్, టమాట కిచప్, వెనిగర్ వేసి కలపాలి. తరువాత కార్న్ ఫ్లోర్ ను 3 లేదా 4 టీ స్పూన్ల నీటిలో వేసి కలిపి వేసుకోవాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. సాసెస్ అన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకుని కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మంచురియా తయారవుతుంది. దీనిని నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది.