టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్… ఇలా వాహనం ఏదైనా ఇంధనం అయిపోయిందంటే చాలు చాలా మంది పెట్రోల్ పంప్‌లకు వెళ్లడం, ఇంధనం నింపుకోవడం ఇదే చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ పంప్‌లో అయినా వినియోగదారుల సౌకర్యార్థం పలు సదుపాయాలను ఏర్పాటు చేయాలి. అవి తప్పనిసరి. అలా చేయలేకపోతే ఆ కంపెనీకి చెందిన ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. వారు కూడా స్పందించకపోతే పలు వెబ్‌సైట్లలో వినియోగదారులు ఫిర్యాదు చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ క్రమంలో అసలు పెట్రోల్ పంప్‌లలో వినియోగదారులకు లభ్యమయ్యే సదుపాయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ పంప్‌లో అయినా ఈ కింది సదుపాయాలు కచ్చితంగా కల్పించాలి. అవేమిటంటే… వాహనాల్లో ఉచితంగా గాలి నింపాలి. తాగునీటిని అందించాలి. వినియోగదారులకు ఏవైనా గాయాలు అయితే ప్రథమ చికిత్స చేసేందుకు గాను ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచాలి.
వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు కంప్లెయింట్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలి. ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. అగ్ని ప్రమాదాలు ఏర్పడితే వాటి నుంచి రక్షణ పొందేందుకు గాను ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఇసుకతో నిండిన బకెట్లను ఏర్పాటు చేయాలి. ఇంధన ధరలను, ఆ పంప్ పనిచేసే సమయ వేళలను తెలిపే చార్ట్‌లను ఏర్పాటు చేయాలి. సదరు పెట్రోల్ పంప్ యజమాని పేరు, ఫోన్ నంబర్, ఇతర వివరాలతోపాటు ఆ పంప్‌కు ఉన్న లైసెన్స్ వివరాలను తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలి. ఇంధన నాణ్యతను పరీక్షించేందుకు గాను ఏ పెట్రోల్ పంప్‌లో అయినా ఫిల్టర్ పేపర్ టెస్ట్, డెన్సిటీ చెక్‌లను విధిగా ఏర్పాటు చేయాలి. ఫిల్టర్ పేపర్ టెస్ట్ ఎలా చేయాలంటే… ఒక ఫిల్టర్ పేపర్‌ను తీసుకుని దానిపై కొన్ని చుక్కల పెట్రోల్ వేయాలి. అది 2 నిమిషాల్లో ఆవిరి అవుతుంది. దాంతోపాటు పెట్రోల్ చుక్కలు పడిన ప్రాంతంలో పింక్ కలర్ గా పేపర్ మారుతుంది. ఒక వేళ ఆ కలర్ కాకుండా వేరే ఏ కలర్ వచ్చినా ఆ పెట్రోల్ నాణ్యమైంది కాదని గుర్తించాలి. వెంటనే అప్రమత్తమై ఫిర్యాదు చేయాలి.
డెన్సిటీ చెక్ చేసేందుకు 500 ఎంఎల్ కెపాసిటీ కలిగిన జార్, హైడ్రోమీటర్, థర్మామీటర్ వంటివి అవసరమవుతాయి. వాటిని పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయాలి. వినియోగదారులు ఆయా పరికరాలను తీసుకుని జార్‌లో 3/4 వ వంతు వరకు ఇంధనం నింపాలి. అనంతరం హైడ్రోమీటర్, థర్మామీటర్‌లతో డెన్సిటీ, ఉష్ణోగ్రత వంటి వాటిని రికార్డు చేయాలి. ఆ తరువాత పెట్రోల్ పంప్‌లో ఉండే డెన్సిటీ చార్ట్‌తో ఆ వివరాలను పోల్చి చూడాలి. ఏవైనా అనుమానాస్పదంగా వివరాలు రికార్డు అయితే అప్పుడు ఫిర్యాదు చేయాలి. పెట్రోల్ పంపుల్లో నింపే ఇంధనం సరైన ప్రమాణంలోనే వస్తుందని తెలుసుకునేందుకు పెట్రోల్ పంపుల్లో 5 లీటర్ల కెపాసిటీ ఉన్న జార్‌లను ఏర్పాటు చేయాలి. వాటిలో ఇంధనం నింపడం ద్వారా వినియోగదారులు తమకు సరైన మొత్తంలోనే ఇంధనం వస్తుందని రూఢి చేసుకోవచ్చు. ఏవైనా అవకతవకలు జరిగితే ఫిర్యాదు చేయవచ్చు.
వినియోగదారులు ఇంధనం నింపుకుంటే విధిగా బిల్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సదరు పంప్ వారు ఏవైనా మోసానికి పాల్పడితే వారిపై ఫిర్యాదు చేసేందుకు వీలుంటుంది. వినియోగదారులు తమకు ఎదురయ్యే ఏ సమస్యనైనా ముందుగా పెట్రోల్ పంప్ యజమాని లేదా ఆ కంపెనీతో పరిష్కరించుకోవాలి. అలా కుదరని పక్షంలో వారు Centralized Public Grievances Redness & Monitoring System (CPGRAMS) వారికి వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.