Venna Murukulu : మనం విరివిగా తయారు చేసే పిండి వంటకాల్లో మురుకులు కూడా ఒకటి. మురుకులు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. టీ తాగేటప్పుడు, అలాగే పిల్లలకు స్నాక్స్ గా ఇవ్వడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. తరచూ చేసే ఈ మురుకులను వెన్న వేసి మరింత రుచిగా, మరింత క్రిస్పీగా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్రిస్పీగా, రుచిగా మురుకులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెన్న మురుకుల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కప్పు, శనగపిండి – ఒక కప్పు, పుట్నాల పప్పు పొడి – పావు కప్పు, ఉప్పు – తగినంత, కారం – 2 స్పూన్స్, నువ్వులు – 2 స్పూన్స్, వాము లేదా జీలకర్ర – ఒక స్పూన్, వెన్న – 2 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
వెన్న మురుకుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. తరువాత వెన్న వేసి కలపాలి. తరువాత వేడి నీళ్లు పోస్తూ ముందుగా గంటెతో కలుపుకోవాలి. తరువాత చేత్తో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని మెత్తగా కలుపుకున్న తరువాత జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత అందులో పిండిని ఉంచి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జంతికలను వత్తుకోవాలి. వీటిని పెద్ద మంటపై 2 నిమిషాల పాటు కాల్చుకున్న తరువాత మంటను మధ్యస్థంగా చేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని చల్లారిన తరువాత గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెన్న మురుకులు తయారవుతాయి. ఇలా అప్పటికప్పుడు రుచిగా, క్రిస్పీగా ఉండే వెన్న మురుకులను తయారు చేసుకుని తినవచ్చు.