Molakala Vada : మన శరీరానికి కావల్సిన పోషకాలను, అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో మొలకెత్తిన విత్తనాలు ముందు స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. మనం వివిధ రకాలు దినుసులను మొలకెత్తించి తీసుకుంటూ ఉంటాము. నేటి కాలంలో అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. మొలకెత్తిన గింజలను చాలా మంది నేరుగా తింటూ ఉంటారు.
కొందరు చాట్ రూపంలో చేసుకుని తింటూ ఉంటారు. మొలకెత్తిన గింజలను ఒకేరకంగా తిని తిని బోర్ కొట్టిన వాళ్లు వాటితో అప్పుడప్పుడూ వడలను కూడా చేసుకోవచ్చు. మొలకెత్తిన గింజలతో చేసే ఈ వడలను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మొలకెత్తిన గింజలతో వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకల వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
మొలకెత్తిన పెసర్లు – అర కప్పు, మొలకెత్తిన శనగలు – అర కప్పు, మొలకెత్తిన బొబ్బర్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తురుము – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు -ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1, నూనె డీప్ ఫ్రైకు సరిపడా.
మొలకల వడల తయారీ విధానం..
ముందుగా మొలకెత్తిన పప్పు దినుసులనన్నింటిని జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మొలకల వడలు తయారవుతాయి. నూనెలో డీప్ ప్రై చేయడం ఇష్టం లేని వారు పునుగుల పిండిని వేసి కాల్చుకోవచ్చు. లేదంటే కట్లెట్ ల ఆకారంలో వత్తుకుని పెనం మీద వేసి కాల్చుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న మొలకల వడలను కొబ్బరి చట్నీతో, పల్లీ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.