Idli Podi : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. చట్నీ, సాంబార్ తో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీలను మనం ఇడ్లీ పొడితో కూడా తింటూ ఉంటాము. హోటల్స్, బండ్ల మీద మనకు ఇడ్లీలను ఎక్కువగా ఇడ్లీ పొడితో సర్వ్ చేస్తూ ఉంటారు. ఇడ్లీ పొడిలో నెయ్యి వేసుకుని ఇడ్లీలను తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీ పొడిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే మనం ఈ పొడిని తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలకు చక్కటి రుచిని ఇచ్చే ఈ ఇడ్లీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – అర కప్పు, శనగపప్పు – పావు కప్పు, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – పావు కప్పు, ఇంగువ – అర టీస్పూన్, ఎండుమిర్చి – 7, కాశ్మీరి ఎండుమిర్చి – 2, కరివేపాకు -ఒక రెమ్మ, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత.
ఇడ్లీ పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో మినపప్పు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత శనగపప్పు వేసి వేయించాలి. శనగపప్పు కొద్దిగా వేగిన తరువాత మిరియాలు, జీలకర్ర వేసివేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు వేగిన తరువాత ఇంగువ వేసి కలిపి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, కాశ్మీరి ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో వేయించిన ఈ పదార్థాలన్నీ వేసి తగినంత ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. కారం పొడి చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ పొడి తయారవుతుంది. దీనిని ఇడ్లీలలో వేసుకుని నెయ్యి లేదా నువ్వుల నూనెతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చట్నీ, సాంబార్ లేకపోయిన కూడా ఈ కారం పొడితో ఇడ్లీలను తినవచ్చు.