Pandu Mirchi Kodiguddu Kura : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కోడిగుడ్లతో చేసే కూరలు చాలా రుచిగా, సులభంగా ఉంటాయి. అలాగే కోడిగుడ్లను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. కోడిగుడ్లతో చేసుకోదగిన కమ్మటి వంటకాల్లో పండుమిర్చి గుడ్డు కూర కూడా ఒకటి. పండుమిర్చి, కోడిగుడ్లు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూసారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే పండుమిర్చి గుడ్డు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పండుమిర్చి గుడ్డు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 2, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 2, పండుమిర్చి – 7 లేదా 8, వెల్లుల్లి రెబ్బలు – 5, అల్లం – ఒక ఇంచు ముక్క, తరిగిన ఉల్లిపాయ – 1, నానబెట్టిన చింతపండు- నిమ్మకాయంత, నూనె – 3 స్పూన్స్, ఉడికించిన కోడిగుడ్లు – 4, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పండుమిర్చి గుడ్డు కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించి పొడిగా చేసుకోవాలి. తరువాత జార్ లో పండుమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్లను వేసి వేయించాలి. ఇవి ఎర్రగా వేగిన తరువాత కొద్దిగా ఉప్పు, పసుపు, మిక్సీ పట్టుకున్న పొడి నుండి సగం పొడిని వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి కోడిగుడ్లను ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే కళాయిలో మరో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత ఉప్పు, పసుపు, మిగిలిన మసాలా పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, కూరకు తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన గుడ్లు వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పండుమిర్చి గుడ్డు కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లతో తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.