Pepper Chicken Fry : మనలో చాలా మంది చికెన్ ఫ్రైను ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి, అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనం మన అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ చికెన్ ఫ్రైను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన చికెన్ ఫ్రై వెరైటీలలో పెప్పర్ చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చికెన్ తో తరుచూ ఒకేరకం ఫ్రై కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే చికెన్ పెప్పర్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెప్పర్ చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – పావుకిలో, ధనియాలు – ఒక టీ స్పూన్, లవంగాలు – 4, జీలకర్ర – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, యాలకులు – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెప్పర్ చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, మసాలా దినుసులు, జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత సాజీరా వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 8 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత ఉప్పు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ను పూర్తిగా వేయించాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.