Dondakaya Karam : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే దొండకాయలతో చేసే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. తరచూ చేసే వంటకాలతో పాటు దొండకాయలతో కింద చెప్పిన విధంగా చేసే దొండకాయ కారం కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ దొండకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – పావుకిలో, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 6 లేదా తగినన్ని, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 10.
దొండకాయ కారం తయారీ విధానం..
ముందుగా ఒక దొండకాయలను నిలువుగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మినపప్పు.శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు,, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలువేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలను వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ కారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే కడుపు నిండుగా భోజనం చేస్తారని చెప్పవచ్చు. దొండకాయలను ఇష్టపడని వారు కూడా ఈ కారాన్ని ఇష్టంగా తింటారు.