Eggless Sponge Cake : పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే వాటిలో కేక్ కూడా ఒకటి. కేక్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అలాగే మనం వివిధ రుచుల్లో ఇంట్లోనే కేక్ ను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ కేక్ లల్లో చాక్లెట్ కేక్ కూడా ఒకటి. ఈ కేక్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని మనం చాలాసులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా చక్కగా, రుచిగా, స్పాంజి లాంటి కేక్ ను తయారు చేసుకోవచ్చు. అలాగే పంచదార వాడకుండా, అలాగే ఒవెన్ తో పని లేకుండా కూడా ఈ కేక్ ను మనం తయారు చేసుకోవచ్చు. స్పాంజి లాంటి చాక్లెట్ కేక్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాక్లెట్ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్స్, వంటసోడా – అర టీ స్పూన్, కాఫీ పౌడర్ – ఒక టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూన్, నూనె – పావు కప్పు, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు, కండెన్స్డ్ మిల్క్ – ఒక కప్పు, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్.
చాక్లెట్ కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జల్లెడను ఉంచి అందులో మైదాపిండి వేసి జల్లించాలి. తరువాత కోకో పౌడర్, వంటసోడా, బేకింగ్ పౌడర్, కాఫీ పౌడర్ వేసి జల్లించి అంతా కలిసేలా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో నూనె, పాలు, కండెన్డ్స్ మిల్క్, వెనీలా ఎసెన్స్, వెనిగర్ వేసి బీటర్ తో లేదా విస్కర్ తో బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసిన మైదాపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా అంతా కలిసేలా బీట్ చేసుకోవాలి. తరువాత కేక్ ట్రేను తీసుకుని దానికి నూనె లేదా నెయ్యి రాయాలి. తరువాత దానిపై మైదాపిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ఇందులో కేక్ మిశ్రమాన్నివేసి బుడగలు లేకుండా ట్యాప్ చేసుకోవాలి.
తరువాత మందంగా ఉండే గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత అందులో కేక్ గిన్నెను ఉంచి మూత పెట్టి 35 నుండి 40 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై బేక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత అంచులను ట్రే నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ కేక్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కేక్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే రుచిగా, స్పాంజ్ లాంటి చాక్లెట్ కేక్ ను తయారు చేసుకుని తినవచ్చు.