Chamagadda Karam Pulusu : చామగడ్డలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామగడ్డలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చామగడ్డలతో చేసిన వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. చామగడ్డలతో మనం ఎక్కువగా వేపుడు, కూర, పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. చామగడ్డలతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చామగడ్డ కారం పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే చామగడ్డ కారం పులుసును రాయలసీమ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చామగడ్డ కారం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 4, దంచిన వెల్లుల్లి రెబ్బలు- 10, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పెద్ద టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, నీళ్లు – 400 ఎమ్ ఎల్, ఉడికించిన చామగడ్డలు – పావుకిలో, తరిగిన కొత్తిమీర – గుప్పెడు.
చామగడ్డ కారం పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు రసం వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత చామగడ్డ ముక్కలు వేసి కలపాలి. తరువాత దీనిని చిన్న మంటపై అరగంట పాటు ఉడికించి చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చామగడ్డ కారం పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చామగడ్డ పులుసు 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది.