Ghee Biscuits : నేతి బిస్కెట్లు.. నెయ్యితో చేసే ఈ బిస్కెట్లు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు ఈ బిస్కెట్లను ఇష్టంగా తింటారు. ఈ బిస్కెట్లను తయారు చేయడం చాలా సులభం. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా ఈ బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఒవెన్ లేకపోయినా కూడా ఈ బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ నేతి బిస్కెట్లను ఒవెన్ లేకపోయినా కూడా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేతి బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, పంచదార పొడి – అర కప్పు, మైదాపిండి – ఒక కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్.
నేతి బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నెయ్యిని తీసుకోవాలి. తరువాత ఇందులో పంచదార పొడి వేసి వైట్ క్రీమ్ అయ్యే వరకు బాగా కలపాలి. తరువాత మైదాపిండి, బేకింగ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత పెద్ద గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత ప్లేట్ ను తీసుకుని దానికి నెయ్యిని రాసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మందంగా బిస్కెట్ల ఆకారంలో చేత్తో వత్తుకుని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి.
వీటిపై డ్రై ఫ్రూట్స్ ను లేదా మనకు నచ్చిన ఆకారంలో డిజైన్స్ వత్తుకోవాలి. తరువాత ఈ ప్లేట్ ను ఫ్రీహీట్ చేసిన గిన్నెలో ఉంచి చిన్న మంటపై 25 నుండి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అదే ఒవెన్ లో తయారు చేసే వారు ఫ్రీహీట్ చేసిన ఒవెన్ లో 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకుని బయటకు తీసుకోవాలి. ఈ బిస్కెట్లు చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నేతి బిస్కెట్లు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన బిస్కెట్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.