Apple Jam : ఆపిల్ జామ్.. పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు. బ్రెడ్, చపాతీ, పూరీ వంటి వాటితో తినడానికి ఈ జామ్ చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా ఈ జామ్ ను మనం బయట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బయట తయారు చేసే ఈ జామ్ లో నిల్వ ఉండడానికి ఫ్రిజర్వేటివ్స్ ను కలపడంతో పాటు కలర్ ఫుల్ గా కనబడడానికి ఫుడ్ కలర్స్ ను కూడా కలుపుతూ ఉంటారు. అయితే ఇలా కలర్స్, ఫ్రిజర్వేటివ్స్ ఏమి కలపకుండా కూడా మనం జామ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆపిల్ జామ్ ను తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే ఎటువంటి కలర్స్, ఫ్రిజర్వేటివ్స్ లేకుండా ఆపిల్ జామ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ జామ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆపిల్స్ – ముప్పావుకిలో, బీట్ రూట్ – చిన్నది ఒకటి, పంచదార – ముప్పావు కప్పు, ఉప్పు – చిటికెడు, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
ఆపిల్ జామ్ తయారీ విధానం..
ముందుగా ఆపిల్స్ లో ఉండే గింజలను తీసేసి చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత బీట్ రూట్ పై ఉండే తొక్కను తీసేసి దానిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ఆవిరి మీద 10 నిమిషాల పాటు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను స్ట్రెయినర్ లో వేసి స్పూన్ తో వత్తుతూ వడకట్టాలి. ఇలా చేయడం వల్ల మెత్తని పేస్ట్ తో మాత్రమే మనం జామ్ ను తయారు చేసుకోవచ్చు. తరువాత ఈ పేస్ట్ ను కళాయిలో వేసి అందులోనే పంచదార వేసి కలుపుతూ ఉడికించాలి.
ఈ జామ్ ను మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. దీనిని జామ్ లా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కగా అయిన తరువాత నిమ్మరసం వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆపిల్ జామ్ తయారవుతుంది. దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా మన ఇంట్లోనే చాలా రుచిగా ఎలాంటి ఫ్రిజర్వేటివ్స్ లేకుండా ఆపిల్ జామ్ ను తయారు చేసుకుని తినవచ్చు.