Rumali Roti : మనకు రెస్టారెంట్ లలో, ధాబాలల్లో లభించే వాటిల్లో రుమాలీ రోటీలు కూడా ఒకటి. ఎక్కువగా వీటిని ఫంక్షన్ లల్లో సర్వ్ చేస్తూ ఉంటారు. రుమాలి రోటీలు చాలా మెత్తగా, రుచిగా ఉంటాయి. పనీర్, చికెన్ వంటి మసాలా కర్రీలతో తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అయితే చాలా మంది వీటిని మనం ఇంట్లో తయారు చేసుకోలేము అని భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుమాలీ రోటీలను చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే రుమాలి రోటీలను మెత్తగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రుమాలి రోటీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పంచదార – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
రుమాలి రోటీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత మరో గిన్నెలో ఉప్పు, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి అవి కరిగే వరకు కలుపుకోవాలి. తరువాత ఈ నీటిని పిండిలో పోసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి చపాతీ పిండి కంటే మెత్తగా ఉండాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పిండిని 4 నిమిషాల పాటు వత్తుతూ కలుపుకోవాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నూనె వేసి మరో 4 నిమిషాల పాటు వత్తుతూ కలుపుకోవాలి. తరువాత పిండిని సమాన భాగాలుగా చేసుకుని పిండి చల్లిన ప్లేట్ మీద వేసి తడి వస్త్రాన్ని కప్పి అరగంట పాటు పక్కకు ఉంచాలి. అరగంట తరువాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అర కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ కళాయిని బోర్లించి ఉంచాలి. కళాయి వేడయ్యాక దానిపై ముందుగా సిద్దం చేసుకున్న ఉప్పు నీటిని చల్లుకోవాలి.
తరువాత పిండి ముద్దను తీసుకుని పిండి చల్లుకుంటూ ముందుగా చేత్తో వత్తుకోవాలి. తరువాత చపాతీ కర్రతో వీలైనంత పలుచగా వత్తుకోవాలి. తరువాత ఈ రోటిని చేత్తుల్లోకి తీసుకుని అటూ ఇటూ తిప్పుతూ నెమ్మదిగా సాగదీయాలి. దీనిని వీలైనంత పలుచని రోటీలా చేసుకున్న తరువాత దీనిని కళాయిపై వేసి అర నిమిషం పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ రోటీని అటూ ఇటూ తిప్పుతూ కాల్చుకుని కర్ఛీప్ లా మడతపెట్టి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల రుచిగా, మెత్తగా ఉండే రుమాలిరోటీ తయారవుతుంది. దీనిని నాన్ వెజ్ కూరలతో, మసాలా కూరలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా సులభంగా ఇంట్లోనే రుమాలి రోటీలను తయారు చేసి తీసుకోవచ్చు.