Nookala Payasam : నూకల పాయసం.. బాస్మతీ బియ్యంతో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని తినవచ్చు. ఈ పాయసాన్ని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. తరుచూ చేసే పాయసం కంటే కింద చెప్పిన విధంగా తయారు చేసిన నూకల పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే నూకల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నూకల పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు లేదా 130 గ్రా., చిక్కటి పాలు – లీటర్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, బెల్లం – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, తరిగిన బాదంపప్పు – కొద్దిగా, ఎండుద్రాక్ష – కొద్దిగా.
నూకల పాయసం తయారీ విధానం..
ముందుగా నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని జార్ లో వేసి నూకలుగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో పాలు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న బియ్యం వేసి ఉడికించాలి. దీనిని కలుపుతూ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. బియ్యం మెత్తగా ఉడికి పాలు దగ్గర పడిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి.
తరువాత జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండు ద్రాక్ష, బాదంపప్పు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన పాయసంలో బెల్లం నీరు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నూకల పాయసం తయారవుతుంది. ఈ విధంగా తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా సులభంగా నూకల పాయసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.