Bendakaya Masala Gravy : మనం బెండకాయలతో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. వీటితో ఎక్కువగా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.తరుచూ చేసే ఈ వంటకాలతో పాటు బెండకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే గ్రేవీకర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. బెండకాయలతో తరుచూ చేసే వంటకాల కంటే ఇలా చేసే గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలతో రుచిగా, కమ్మగా, ఎందులోకైనా తీసుకునేలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన బెండకాయలు – పావు కిలో, పసుపు – పావు టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, కరివేపాకు – 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, టమాట ఫ్యూరీ – ఒక కప్పు, జీడిపప్పు పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బెండకాయ మసాలా గ్రేవీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత బెండకాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించాలి. తరువాత పెరుగు, టమాట పేస్ట్ వేసి బాగా కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిని కూడా బాగా వేయించిన తరువాత బెండకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.