Mixed Veg Ghee Kichdi : మిక్డ్స్ వెజ్ ఘీ కిచిడీ.. నెయ్యి, కూరగాయ ముక్కలన్నీ వేసి కలిపి చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. వెరైటీగా తినాలన్నా, కూర ఏం చేయాలో తోచనప్పుడు ఇలా మిక్డ్స్ వెజ్ ఘీ కిచిడీని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారుచేయడం చాలా తేలిక. ఈ కిచిడీని తీసుకోవడం వల్ల శరీరానికి కూడా మేలు కలుగుతుంది. మసాలాలు వేయకుండా కమ్మగా మిక్డ్స్ వెజ్ ఘీ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్నవివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్డ్స్ వెజ్ ఘీ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, ఎండుమిర్చి – 4, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, తరిగిన క్యారెట్ – 1, తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 4, తరిగిన వంకాయలు – 3, తరిగిన బంగాళాదుంప – 1, ఉప్పు – తగినంత, పెసరపప్పు – ఒక కప్పు, గంట పాటు నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
మిక్డ్స్ వెజ్ ఘీ కిచిడీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పసుపుతో పాటు కూరగాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి. తరువాత పెసరపప్పు, బియ్యం వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, నీళ్లు పోసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ పెద్ద మంటపై, రెండు విజిల్స్ మధ్యస్థ మంటపై వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్డ్స్ వెజ్ ఘీ కిచిడీ తయారవుతుంది. దీనిని రైతా, టమాట చట్నీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కిచిడీని తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.